నటిగా అలరించిన రేణూదేశాయ్ అడపాదడపా డైరెక్టర్‌గాను వైవిధ్యమైన చిత్రాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. గత కొద్ది రోజులుగా రేణూ మళ్ళీ మెగా ఫోన్ పట్టనుందంటూ పలు వార్తలు హల్ చల్ చేశాయి. దీనిపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది. వ్యవసాయానికి సంబంధించిన ప్రాజెక్ట్‌తో రేణూ బిజీగా ఉండగా, ఈ సినిమా కోసం పలు లొకేషన్‌లు సెర్చ్ చేసిందట. తెలంగాణలోనే చిత్ర షూటింగ్ జరపనుండగా, ఇందులో రైతుల దుస్థితిని గురించి వివరించనున్నారని అంటున్నారు.
రీసెంట్‌గా ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడిన రేణూ దేశాయ్ తన తదుపరి ప్రాజెక్ట్ చిల్డ్రన్ బేస్డ్ మూవీగా ఉంటుందని చెప్పుకొచ్చింది. చిన్న తనంలో సెలవులని తల్లిదండ్రుల పొలంలో గడిపానని చెప్పిన రేణూ దేశాయ్, ఈ కాలం నాటి పిల్లలకి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేవి తెలవవని అన్నారు. పిల్లలకి బియ్యం, కూరగాయలు ఎక్కడి నుండి వచ్చాయో కూడా తెలియడం లేదు. నా సినిమా ద్వారా సానుకూల మార్పుని తీసుకురావాలని ఆశిస్తున్నాను అని రేణుదేశాయ్ స్పష్టం చేసింది. ఈ చిత్రం రైతులపై ఆధారపడినప్పటికీ, రేణు దానిని వినోదాత్మకంగా వివరిస్తారట. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, సొంత బేనర్‌లో నిర్మిస్తుంది పవన్ మాజీ భార్య.